జవహర్ లాల్ నెహ్రు జూ పార్క్‎ లో 125 ఏళ్ల తాబేలు మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రు జూ పార్క్‎ లో 125 సంవత్సరాల వయస్సు గల తాబేలు ప్రాణాలు విడిచింది. ఈ తాబేలుకు జూ పార్కులో ఎంతో ప్రత్యేకత ఉంది. దీని పేరు రాక్షసుడు. గత కొన్నేళ్లుగా ఈ తాబేలుతో జూ పార్క్‎ కు విడతీయరాని బంధం ఉంది. అయితే కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న రాక్షసుడు పది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. దీంతో రాక్షసుడు ఆరోగ్యం మరింత క్షిణించి నిన్న తుది శ్వాస విడిచింది. విషయాన్ని తెలుసుకున్న జూ అధికారులతో పాటు గత కొన్నేళ్లపాటు దానికి సేవలు చేసిన వారు భావోద్వేగానికి గురయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కును నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. వివిధ రకాల జంతువులు, పక్షులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్న జంతువులను, పక్షులను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక సమ్మర్‎లో సెలవులు ఉండటంతో చిన్న పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అయితే జూ పార్క్ లోకి వెళ్ళగానే మొదటగా కనిపించేది తాబేలు. ఇది చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారీ శరీరంతో చిన్న చిన్న అడుగులు వేస్తూ కదులుతూ ఉంటే పెద్దవాళ్లు సైతం చిన్న పిల్లలుగా మారిపోతారు. ఇప్పుడు ఆ భారీ తాబేలే ప్రాణాలు విడిచింది.1963లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేలను జూ పార్కు తరలించారు. అప్పటినుంచి ఈ రాక్షసుడు అనే తాబేలు జూ పార్క్ లోనే నివసిస్తుంది. జూ పార్క్‎లోకి ఎవరు వచ్చినా ముందుగా ఈ భారీ తాబేలు చూసిన తర్వాతే మిగతా జంతువులు, పక్షులను చూసేందుకు వెళుతుంటారు. అయితే ఈ భారీ తాబేలు ఇకనుంచి కనిపించదనే విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇకపోతే తాబేలు జీవితకాలం 80 సంవత్సరాల నుంచి 150 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ రాక్షసుడు అనే తాబేలు అనారోగ్య కారణాలవల్ల 125 సంవత్సరాలలోనే తుది శ్వాసను విడిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)