ఆయనకు భార్య పేరే గుర్తు లేదని ట్రంప్‌పై బైడెన్‌ విమర్శలు !

Telugu Lo Computer
0


రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతోన్న జో బైడెన్‌కు వయసురీత్యా వచ్చే ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దీనికి సంబంధించి వస్తోన్న విమర్శలను ఆయన మరోసారి తోసిపుచ్చారు. అలాగే తన ప్రధాన పోటీదారు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌ కూడా తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు తన సతీమణిని వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికను ప్రస్తావించారు. లేట్‌నైట్ విత్ సేథ్‌ మేయర్స్‌ షోలో పాల్గొన్న బైడెన్ ఈమేరకు స్పందించారు. 'మీరు అవతలి వ్యక్తి(ట్రంప్‌ను ఉద్దేశించి)ని పరిశీలించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు' అని బైడెన్ విమర్శలు చేశారు. అలాగే ఆయన ఆలోచనలన్నీ కాలం చెల్లినవని వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా..? లేక తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా..? అనే దానిపై స్పష్టత లేదు. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా 'మసక'గా ఉందని పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి లేదని పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను ఆయన తీవ్రంగా ఖండించారు. దీనికిముందు కూడా బైడెన్ జ్ఞాపకశక్తిని లైవ్‌లో చూసి అమెరికన్లు అవాక్కయిన సందర్భాలున్నాయి. ఇవన్నీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. రిపబ్లికన్ పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఆయన ట్రంప్‌ను విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)