రాహుల్‌ పోరాటం ఫలించకపోతే ప్రజలకు కష్టాలు తప్పవు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన 'న్యాయ్‌ సంకల్ప్‌ సమ్మేళన్‌' ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారని, ఒకవేళ ఈ పోరాటం విఫలమైతే మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. పార్టీలో ఏ ఒక్కరూ తీసుకోని సాహసోపేత నిర్ణయం రాహుల్‌ తీసుకున్నారని కొనియాడారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టారని ఖర్గే అన్నారు. ప్రతికూల, శీతల వాతావరణంలో ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. భాజపా అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అని చెప్పారు. ''ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్‌ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వకపోతే మోడీకి బానిసలుగా మిగిలిపోవాల్సి ఉంటుంది'' అని ఖర్గే అన్నారు. యువతకు ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పిస్తామంటూ బూటకపు హామీలతో మోడీ  గద్దెనెక్కారని ఖర్గే విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షానికి చెందిన 411 మంది శాసనకర్తలపై కేసులు పెట్టి భాజపా జైలుకు పంపిందన్నారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి ఆయా రాష్ట్రాల్లో అధికారం చేపడుతోందని దుయ్యబట్టారు. ఝార్ఖండ్‌లో ఆ పార్టీ చేస్తున్న కుటిల యత్నాలు ఎంతమాత్రం ఫలించవన్నారు. ఢిల్లీలో బూత్‌ స్థాయిలో పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)