వందే భారత్‌ స్లీపర్‌ రైలు ?

Telugu Lo Computer
0


భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ స్లీపర్‌ వర్షన్‌ తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి వరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైలు సిద్ధమవుతున్నది. తాజాగా వందే భారత్‌ స్లీపర్‌ తొలి రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్‌ రన్‌ విజయవంతమైన తర్వాత రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్‌ స్లీపర్‌ రైలు ప్రస్తుతం ఉన్న హైస్పీడ్‌ రైళ్లకంటే వేగంగా ప్రయాణిస్తాయని, సుదూర ప్రాంతాలను కలుపుతూ వీటిని నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రాజధాని రైళ్ల వేగాన్ని అధిగమించే లక్ష్యంతో, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు స్లీపర్‌ రైళ్లను నడపాలని యోచిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. మొదటి విడతలో పది రైళ్లను ప్రారంభిస్తారని ఇందులో ఢిల్లీ – ముంబయి, ఢిల్లీ – హౌరాతో సహా పలు మార్గాల్లో ఏప్రిల్‌లో స్లీపర్‌ వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య దాదాపు 16-20 మధ్య ఉంటుందని చెప్పారు. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైళ్లు ఉన్నాయని వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)