ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆఖర్లో లాభాల స్వీకరణతో ఫ్లాట్‌గా ముగిశాయి. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, ఐటీసీ షేర్లలో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. సెన్సెక్స్‌ ఈ ఉదయం 73,394.44 వద్ద (క్రితం ముగింపు 73,158.24) లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,413.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 15.45 పాయింట్ల నష్టంతో 73,142.80 వద్ద ముగిసింది. నిఫ్టీ ఆరంభంలోనే 22,297.50 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసేసరికి 4.75 పాయింట్ల నష్టంతో 22,212.70 వద్ద స్థిర పడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.94గా ఉంది. సెన్సెక్స్‌-30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, టైటాన్‌, విప్రో, రిలయన్స్‌ షేర్లు ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌టెక్‌, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ చమురు ధర 82.58 డాలర్లు వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2027.10 వద్ద ట్రేడవుతోంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు సంబంధించిన విషయాన్ని గురించి చర్చించేందుకు ఫిబ్రవరి 27న బోర్డు సమావేశం నిర్వహించినట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఈనేపథ్యంలో వొడా షేరు వరుసగా రెండోరోజూ లాభపడింది. నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో 6 శాతం పెరిగిన షేరు విలువ.. ఈరోజు మరో 7.67 శాతం పెరిగి రూ.17.55 వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)