డిప్యూటీ తహశీల్దార్‌ దుశ్చర్యకు యాచకుడు బలి ?

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఓ డిప్యూటీ తహశీల్దార్‌ పాశవిక వైఖరి కారణంగా ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోయాడు. డబ్బులు అడిగాడని కోపంతో అతన్ని తన్నడంతో టిప్పర్‌ కింద పడి మృతి చెందాడు. ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్‌ వద్ద ఆగిన కార్లను తుడుస్తూ డబ్బులు అడుక్కుంటూ శివరాం అనే యాచకుడు జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం మెండోరా మండల డిప్యూటీ తహశీల్దార్‌ రాజశేఖర్‌ కారు ఆ సిగ్నల్‌ దగ్గర ఆగింది. ఆ సమయంలో శివరాం వచ్చి డిప్యూటీ తహశీల్దార్‌ కారు అద్దాలను క్లీన్‌ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరాడు. కానీ రాజశేఖర్‌ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇంతలోనే సిగ్నల్‌ పడటంతో రాజశేఖర్‌ వెళ్లిపోయాడు. డబ్బులు ఇవ్వకుండా రాజశేఖర్‌ వెళ్లిపోవడంతో శివరాం కారు వెంబడి పరుగులు పెట్టాడు. అది చూసి ఆగ్రహానికి లోనైన రాజశేఖర్‌ కోపంగా కారు దిగి శివరాంను కాలితో తన్నాడు. దీంతో అటువైపుగా వస్తున్న టిప్పర్‌ వెనక టైర్ల కింద పడి శివరాం ప్రాణాలు కోల్పోయాడు. టిప్పర్‌ కింద పడి యాచకుడు మరణించాడనే వార్త తెలుసుకున్న పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడి కూడలిలో ఉన్న సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా మెండోరా డిప్యూటీ తహశీల్దార్‌ అమానుష చర్య బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)