బ్రెస్ట్ క్యాన్సర్​తో ఏటా 82 వేల మంది మృతి !

Telugu Lo Computer
0


దేశంలో బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ వంటివి మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వికల్ క్యాన్సర్ వల్ల తాను చనిపోయినట్టుగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఆడిన చావు నాటకం సంచలనం సృష్టించింది. ఈ రెండు వరుస ఘటనల నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ పై జనాలు ఫోకస్ పెట్టారు. అయితే, సర్వికల్ క్యాన్సర్ కంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదకరంగా మారుతోందని, దేశంలో ఏటా వేల మంది ప్రాణాలు బలితీసుకుంటోందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది మన దేశంలో 82,429 మంది బ్రెస్ట్ క్యాన్సర్‌తో ప్రాణాలొదిలినట్టు ఐసీఎంఆర్‌ క్యాన్సర్ రిజిస్ట్రీ విభాగం లెక్కగట్టింది. 2019 నుంచి ఏటా 2 వేల నుంచి 2,500 చొప్పున బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు పెరుగుతూ పోతున్నాయని వెల్లడించింది. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా గతంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో ఎక్కువ భాగం 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న మహిళలే ఉంటున్నారు. అందుకే 35 ఏండ్ల దాటిన తర్వాత కనీసం రెండేండ్లకోసారి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 12 ఏండ్ల కంటే ముందే మెచ్యూర్డ్(పీరియడ్స్ మొదలవడం) అయినవారికి, 55 ఏండ్ల తర్వాత మెనోపాజ్ (పీరియడ్స్ ఆగిపోవడం) వచ్చిన మహిళలకు, లేదంటే పిల్లలు కనని మహిళలకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఉంటుంది. అధిక కొవ్వు ఉన్న ఆహారంతో కూడా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. పొగాకు లేదా మద్యం సేవించడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)