భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడితో నిన్న భారీగా నష్టపోయిన సూచీలు  ఆయా షేర్లలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి 1100 పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ 21,450 పాయింట్ల ఎగువన ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 70,165.49 పాయింట్ల (క్రితం ముగింపు 70,370.55) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. మధ్యలో కాసేపు నష్టాల్లోకి వెళ్లినా ఇంట్రాడేలో ఎక్కువ సేపు లాభాల్లోనే కదలాడింది. చివరికి 689.76 పాయింట్ల లాభంతో 71,060.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 215.15 పాయింట్ల లాభంతో 21,453.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.12గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఇండస్‌ ఇండ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.88 డాలర్లు వద్ద.. బంగారం ఔన్సు ధర 2033 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. లాభాల్లో జీ షేర్లు: సోనీతో డీల్‌ రద్దవ్వడంతో నిన్న భారీగా నష్టపోయిన జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ షేర్లు ఇవాళ కాస్త కోలుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ జీ షేర్లు 6.28 శాతం లాభంతో 165.75 వద్ద ముగిశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)