బీజేపీ మహిళా వ్యతిరేకి !

Telugu Lo Computer
0


బీజేపీ మహిళా వ్యతిరేకి అని,  అందుకే వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీత గురించి కాదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. సోమవారం అయోధ్యలోని రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. అయితే అదే రోజున మమతా బెనర్జీ కోల్‌కతాలో సర్వమత సామరస్య ర్యాలీ నిర్వహించారు. అన్ని మతాలకు చెందిన వారితో కలిసి సత్యాగ్రహ మార్చ్‌ చేపట్టారు. కాళీఘాట్‌లోని కాళీమాత ఆలయంలో పూజ తర్వాత ఈ ర్యాలీని ప్రారంభించారు. మార్గమధ్యలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ఆమె సందర్శించారు. కాగా, ఈ సందర్భంగా మమతా బెనర్జీ బీజేపీపై మండిపడ్డారు. 'వారు (బీజేపీ) రాముడి గురించి మాట్లాడతారు. మరి సీతా దేవి సంగతి ఏమిటి? రాముడి వనవాస సమయంలో ఆయన వెంట ఆమె ఉన్నది. వారు (బీజేపీ) మహిళా వ్యతిరేకులు. కాబట్టి సీత గురించి మాట్లాడరు. మేం దుర్గామాత ఆరాధకులం. వారు మాకు మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు' అని అన్నారు. మరోవైపు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమం బీజేపీ రాజకీయ జిమ్మిక్కు అని మమతా బెనర్జీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మతాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి పద్ధతికి తాను వ్యతిరేకమని తెలిపారు. 'రాముడిని పూజించే వారిపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)