మహువా మొయిత్రాపై అనర్హత వేటు !

Telugu Lo Computer
0


మూజువాణి ఓటు ద్వారా లోక్‌సభ శుక్రవారం టిఎంసి నేత అనర్హత వేటు వేసింది. ఎథిక్స్‌ కమిటీ నివేదిక సిఫారసుతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మొయిత్రాను బహిష్కరించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహువా మొయిత్రా తన పార్లమెంట్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌ను ఇతరులకు ఇవ్వడంతో పాటు వ్యాపారవేత్త నుండి బహుమతులను తీసుకోవడంతో ఆమెను దోషిగా నిర్థారిస్తున్నట్లు ఎథిక్స్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. మహువా మొయిత్రాను మాట్లాడేందుకు అనుమతించాలని టిఎంసి గట్టిగా వాదించినప్పటికీ.. జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్‌ ఓం. బిర్లా మహువాను మాట్లాడేందుకు అనుమతించకుండా ఓటింగ్‌కు అనుమతించారు. ఓటింగ్‌ నిర్వహిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు. శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ నివేదికను పార్లమెంటుకు సమర్పించారు. నివేదిక కాపీని సమర్పించాలని డిమాండ్‌ చేస్తూ టిఎంసి, కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేపట్టారు. ఎథిక్స్‌ కమిటీ నివేదికను పరిశీలించేందుకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ ఓం. బిర్లాను తమ పార్టీ లేఖలో కోరినట్లు టిఎంసి ఎంపి కల్యాణ్‌ బెనర్జీ తెలిపారు. లోక్‌సభ నుండి తనను బహిష్కరించడాన్ని మహువా మొయిత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎథిక్స్‌ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని, తమని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఆయుధంగా వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలతో తనను దోషిగా నిర్ధారించారని ధ్వజమెత్తారు. శనివారం సిబిఐని తన నివాసంపై దాడికి పంపి తనను వేధించవచ్చని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)