మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు !

Telugu Lo Computer
0


తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మిజోరం లాల్‌దుహోమాను మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ కోరారు. వీలైతే తమ రాష్ట్రంలో మళ్లీ శాంతి నెలకొనేందుకు వీలైనంత సాయం చేయాలన్నారు. నుపి లాన్‌ (బ్రిటీష్‌ వారిపై మహిళల యుద్ధం)ను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరేన్‌సింగ్‌ ఇటీవల లాల్‌దుహోమా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన పరిధిలో లేని అంశాలపై అభిప్రాయాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. మయన్మార్‌ సరిహద్దులోని మోరె పట్టణంలో నివాసముంటున్న తమ కుకీ-జో ప్రజలను మణిపుర్‌ పోలీసులు వేధించవద్దని లాల్‌దుహోమా చేసిన వ్యాఖ్యలపై బీరేన్‌ సింగ్‌ మండిపడ్డారు. ''మోరెలో పలు జాతుల ప్రజలు నివాసముంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా లాల్‌దుహోమా మాట్లాడుతున్నారు. మోరెలో తమ ప్రజలను వేధించకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావు. లాల్‌దుహోమా రాజ్యాంగ పరిధికి మించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానుకోవాలి. ఆయనకు నా తరఫున ఓ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. వీలైతే మణిపుర్‌లో తిరిగి శాంతి నెలకొల్పేందుకు సహకరించాలి. గతంలో మిజోరంలో బ్రూ తెగల మధ్య జరిగిన వివాదంలో మేము జోక్యం చేసుకులేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మణిపుర్‌లో ఏం జరిగినా అది మా అంతర్గత వ్యవహారం. దయచేసి ఈ విషయంలో మీరు జ్యోకం చేసుకోవద్దు'' అని బీరెన్‌ సింగ్‌ కోరారు. మిజోరాంలో జోరంథంగా తర్వాత అధికారం చేపట్టిన లాల్‌దుహోమా మణిపుర్‌లోని కుకీ-జో ప్రజల విషయంలో చురుగ్గా స్పందిస్తారనే పేరుంది. ఆయన జో ప్రజల పునరేకీకరణకు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. మణిపుర్‌లోని కుకీ-జో ప్రజలు, మిజోరాంలోని స్థానికుల్లో అత్యధిక మంది ఈ జో గ్రూపునకు చెందుతారు. అయితే, మయన్మార్‌లో యుద్ధం కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన ప్రజలకు తమ ప్రభుత్వం శిబిరాల్లో ఆశ్రయం కల్పిస్తున్నామని లాల్‌దుహోమా చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)