బీజేపీ కక్షసాధింపు రాజకీయాలు !

Telugu Lo Computer
0


తమ పార్టీ సహచరి మహువ మొయిత్రపై వేటు వేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ  తీవ్రంగా ఖండించారు. బహిష్కృత ఎంపీకి పార్టీ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన దీదీ బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీని బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం మహువ మొయిత్రకు సభలో మాట్లాడే అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. వివరణ ఇచ్చేందుకు ఎంపీకి అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన తీరును తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ ఆమెకు పూర్తిగా అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరగాలని తాము కోరుకున్నా ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు అద్దం పడుతోందని దీదీ పేర్కొన్నారు. ఇది పార్లమెంట్ చరిత్రలో విషాదకర రోజని దీదీ అన్నారు. మొయిత్రను బహిష్కరిస్తూ లోక్‌సభ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడవడమేనని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో తమకూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని, ఎవరినైనా తక్షణమే బహిష్కరించే అవకాశం ఉందని, కానీ తాము ఇలాగే చేయాలా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం రెండు, మూడు నెలల సమయం మాత్రమే ఉండగా ఇలాంటి ఘటన దురదృష్టకరమని, తాము అంగీకరించబోమని దీదీ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)