బ్యాంకుల్లో రూ.42,270 కోట్లకు చేరిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు !

Telugu Lo Computer
0

2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.42,270 కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకుల వద్ద రూ.6,087 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. అయితే, ఇలాంటి డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడం కోసం ఆర్‌బీఐ ప్రత్యేకంగా ఉద్గమ్‌  పేరిట ఒక కేంద్రీకృత వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. కొన్ని ప్రాథమిక వివరాలతో ఎవరైనా తమ పేరు మీద క్లెయిమ్‌ చేసుకోని డిపాజిట్లు ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కింద బ్యాంకులు వర్గీకరిస్తాయి. బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కు చెందిన 'డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ)' నిధికి వాటిని బదిలీ చేస్తాయి. అయినప్పటికీ.. సంబంధిత ఆధారాలతో బ్యాంకులను సంప్రదించి వాటిని తిరిగి పొందొచ్చు. ఉద్గమ్‌ పోర్టల్‌లో 29 బ్యాంకులు నమోదయ్యాయి. వాటిలో మీ లేదా మీ సంబంధీకుల ఖాతాల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయేమో చూడొచ్చు. ఖాతాదారులు మరణించిన పక్షంలో నామినీలు లేదా వారసులు అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. తమ వారికి ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత ఆధారాలతో బ్యాంకును సంప్రదించి వాటిని క్లెయిం చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)