ఉత్తరాదిన విజృంభిస్తున్న డెంగ్యూ !

Telugu Lo Computer
0

దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తర భారతంలో చాలామంది వైరస్‌లతో బాధపడుతున్నారు. డెంగ్యూతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్యతో పాటు మరణాలు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్‌ డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు దోమలబారినపడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పగటిపూట డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమలు ఎక్కువగా కుడతాయని, శరీర భాగాలను కప్పి ఉంచేలా దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డెంగ్యూ ఉధృతమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు డెంగ్యూతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుంటే మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 13వేలు దాటింది. గత 24గంటల్లో కొత్తగా 600పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, బీహార్‌లో గత 24 గంటల్లో 373 కొత్త కేసులు నమోదయ్యాయి. పాట్నా జిల్లాలోనే అత్యధికంగా 178 కేసులు రికార్డయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)