ఐటీ ఉద్యోగులకు గాలం వేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు

Telugu Lo Computer
0


ఇండియాలో ఎంఎన్‌సీలు ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఐటీ కంపెనీలకు షాక్ ఇస్తున్నాయి. ఉద్యోగులను ఆకర్షించేందుకు ఐటీ కంపెనీల కంటే 30 శాతం ఎక్కువ శాలరీని ఆఫర్ చేస్తున్నాయి. ఐటీ సెక్టార్‌లో ఉద్యోగులు జాబ్‌లు మానేయడం పెరుగుతోందని, దీనికి కారణం జీసీసీలేనని విప్రో ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులను నిలుపుకునేందుకు పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్లు ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. ' ఎంఎన్‌సీల కేపబిలిటీ సెంటర్లు ఇండియాకు వస్తున్నాయి. ఇవి పెద్ద మొత్తంలో ఐటీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఈ కంపెనీలు సోర్సింగ్‌ కోసం ఆఫ్‌షోర్ బాట పట్టడంతో ఉద్యోగులకు భారీగా జీతాలు ఇవ్వగలుగుతున్నాయి' అని విప్రో చీఫ్ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గోవిల్ అన్నారు. కాగా, ఎంఎన్‌సీలు దేశంలోని ఐటీ కంపెనీలపై ఆధారపడడం తగ్గించేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వర్క్ కోసం కేపబిలిటీ సెంటర్లను ఓపెన్ చేస్తున్నాయి. గతంలో ఇటువంటి సెంటర్లను 'క్యాప్టివ్ సెంటర్లు' గా పిలిచేవారు. సాధారణంగా ఇవి కాల్ సెంటర్లు, డేటా ప్రాసెసింగ్‌, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌కేర్‌ సర్వీస్‌లు వంటివి చూసుకునేవి. ప్రస్తుతం జీసీసీలు కొత్త తరం టెక్ సర్వీస్‌లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. 4 నుంచి 10 ఏళ్ల ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవాళ్లను జీసీసీలు ఎక్కువ నియమించుకుంటున్నాయి. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం, 2022-23 లో దేశంలోని జీసీసీలలో 16.8 లక్షల మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. 2026 నాటికి ఈ నెంబర్ డబుల్ అవుతుందని కూడా అంచనా. దేశంలో 1,600 జీసీసీలు ఉంటే ఇందులో 800 నుంచి 900 సెంటర్లలో 5,000 మంది చొప్పున ఉద్యోగులు పనిచేస్తున్నారని క్వస్‌ ఐటీ స్టాఫింగ్‌ సీఈఓ విజయ్‌ శివరామ్‌ పేర్కొన్నారు. జీసీసీలు ఎక్కువ జీతాలు ఇవ్వడంతో టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్ వంటి టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులకు ఇచ్చే కాంపెన్సేషన్లను పెంచాయి. ఈ కంపెనీలు ఉద్యోగుల కోసం చేసే ఖర్చులు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)