పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే పెళ్లి గురించి ఆలోచించలేదు !

Telugu Lo Computer
0


టీవల రాహుల్‌ రాజస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా జైపుర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. కులగణన, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తదితర అంశాలపై చర్చ మొదలు తన ఇష్టాయిష్టాల వరకు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'మీరు స్మార్ట్‌గా, అందంగా ఉంటారు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించలేదు?' అని ఓ యువతి ప్రశ్నించగా తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే వివాహం వైపు వెళ్లలేదని రాహుల్ గాంధీ బదులిచ్చారు. కాకర కాయ, బఠానీలు, బచ్చలికూర తప్ప మిగతావన్ని తింటానంటూ తనకు ఇష్టమైన ఆహారం ఏంటనే దానిపై స్పందించారు. తాను ఇప్పటివరకు వెళ్లని ప్రదేశాలే తనకిష్టమైన స్థలాలంటూ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటానని తెలిపారు. తన ముఖానికి ఎప్పుడూ సబ్బు, క్రీం పూయలేదని కేవలం నీళ్లతోనే ముఖం కడుగుతానని చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామంలో మహిళల పాత్ర పురుషులకంటే తక్కువేమీ కాదని, అలాంటప్పుడు హక్కుల విషయంలో ఎందుకు వెనుక ఉండాలని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహిళలకు డబ్బు గురించి తెలిసి ఉండాలన్నారు. 'మహిళలకు ఉద్యోగం ఉన్నా.. డబ్బు గురించి తెలియకపోతే వృథానే. అదే, ఉద్యోగం లేకపోయినా.. డబ్బును అర్థం చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలు ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే.. ఎప్పటికీ ఇతరులపైనే ఆధారపడాల్సి ఉంటుంది' అని వివరించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు కాకపోతే ఏమయ్యేవారని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ బదులిస్తూ తనకు అనేక రంగాల్లో ప్రవేశం ఉందన్నారు. ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పగలనని, వంట కూడా చేస్తానని చెబుతూ.. ఈ ప్రశ్నకు జవాబు కష్టమేనన్నారు. గతంలో తన ప్రసంగంలోని 'ఖతమ్‌.. టాటా.. బైబై' మాటలు మీమ్‌ రూపంలో వైరల్‌గా మారిన విషయాన్ని గుర్తుచేయగా.. ఒక్కోసారి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు కూడా ఈ ముచ్చట్లను త్వరగా ముగించాలంటూ తన బృందం ఒత్తిడి తెస్తోందని.. 'టాటా బైబై' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)