ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు మళ్లీ నిరాశాజనకమే !

Telugu Lo Computer
0


దేశీ ఐటీ కంపెనీలకు సాధారణంగా రెండో త్రైమాసికం పటిష్టమైనదే అయినప్పటికీ ఈసారి మాత్రం ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు నెలకొనడంతో క్లయింట్లు తమ వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటం... ఐటీ సంస్థలకు ప్రతికూలంగా ఉండనుంది. పరిస్థితులు మెరుగుపడతాయనేందుకు అర్థవంతమైన సంకేతాలేమీ లేకపోవడంతో క్యూ1లో కనిపించిన బలహీనత రెండో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 11న టీసీఎస్‌తో మొదలుపెట్టి ఐటీ దిగ్గజాలు రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్‌ 12న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, 18న విప్రో ఫలితాలు వెలువడనున్నాయి. 'సాధారణంగా ఐటీ కంపెనీలకు రెండో త్రైమాసికం పటిష్టంగానే ఉంటుంది. కానీ త్రైమాసికాలవారీగా టాప్‌ అయిదు కంపెనీల వృద్ధి చూస్తే మైనస్‌ 1 శాతం (టెక్‌ మహీంద్రా), ప్లస్‌ 1.9 శాతం (హెచ్‌సీఎల్‌ టెక్‌) మధ్య ఉండొచ్చు' అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఒక నోట్‌లో తెలిపింది. పెద్ద ఐటీ కంపెనీలు ఒక మోస్తరుగానే ఉన్నా.. మధ్య స్థాయి సంస్థలు మాత్రం మెరుగ్గానే రాణించనున్నాయి. ఐటీ సేవల రంగం జులై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో త్రైమాసికాల వారీగా సగటున 1.5 శాతం, వార్షికంగా 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. దశాబ్దకాలంలో నమోదైన అత్యంత తక్కువ వృద్ధి రేట్లలో ఈ క్వార్టర్‌ ఒకటి కాగలదని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)