పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన !

Telugu Lo Computer
0


దేశంలోని పలు రాష్ట్రాల్లో సెప్టెంబరు 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కేరళ, తమిళనాడు, కోస్తాంధ్ర, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 48 గంటలపాటు బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారత్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. 48 గంటల తర్వాత తగ్గుముఖం పడతాయని వివరించింది. అండమాన్, నికోబార్ దీవుల్లోనూ బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్ లో ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధుబని, సుపౌల్, అరారియా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్‌ జారీ చేశారు. బిహార్ లోని మరో ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది. ఈశాన్య భారత్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే, పంజాబ్, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, విదర్భలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)