నల్లజాతి బాలికకు మెడల్‌ ఇవ్వకుండా వివక్ష !

Telugu Lo Computer
0


క్రీడాస్ఫూర్తిని చాటాల్సిన వేదికపై ఓ చిన్నారి దారుణమైన వివక్షకు గురైంది. పోటీల్లో గెలిచిన ఆ బాలిక జాతీయత కారణంగా పతకాన్ని అందుకోలేకపోయింది. తోటి చిన్నారులంతా మెడలో పతకాలతో ఉత్సాహంగా ఫొటోలకు పోజులిస్తుంటే  తాను మాత్రం బేలగా చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో గతేడాది చోటుచేసుకున్న ఈ అనైతిక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో గతేడాది మార్చిలో జిమ్నాస్టిక్‌ పోటీలు జరిగాయి. టోర్నీ అనంతరం అందులో గెలిచిన వారికి పతకాలను అందజేశారు. అయితే, చిన్నారుల విభాగంలో మెడల్స్‌ అందజేసిన ఓ మహిళా ప్రతినిధి జాతి వివక్షకు పాల్పడ్డారు. అదే వరుసలో నిల్చున్న ఓ నల్లజాతి బాలికకు పతకం ఇవ్వలేదు. గెలిచిన వారిలో ఆ అమ్మాయి ఒక్కతే నల్లజాతి బాలిక. అయితే, ఆమెను పట్టించుకోకుండా మిగతా చిన్నారులకు మెడల్స్‌ ఇచ్చిన ఆ ప్రతినిధి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, వివక్ష అంటే ఏంటో కూడా తెలియని ఆ బాలిక తనకు పతకం ఎందుకు ఇవ్వలేదో అర్థం కాక అయోమయంగా నిల్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా జిమ్నాస్టిక్‌ స్టార్‌ సిమోన్‌ బైల్స్‌ దీనిపై స్పందిస్తూ  ''ఈ వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. క్రీడల్లో ఎలాంటి జాతివివక్షకు తావు ఉండకూడదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల నేపథ్యంలో ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ స్పందిస్తూ  ఆ బాలికకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ''ఘటన కారణంగా ఆ బాలిక, ఆమె కుటుంబం పడిన ఇబ్బందికి మేం క్షమాపణలు తెలియజేస్తున్నాం. జరిగిన దానికి మేం పశ్చాత్తాపడుతున్నాం. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. వివక్ష ఏ రూపంలోనైనా సరే మేం దాన్ని సహించబోం'' అని ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ ప్రకటన విడుదల చేసింది. కాగా గతేడాది మార్చిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పొరబాటును గుర్తించి అప్పుడే దాన్ని సరిదిద్దుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. బాలిక మైదానాన్ని వీడేలోపే తన పతకాన్ని అందజేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత బాలిక, ఆమె కుటుంబానికి లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పినట్లు వెల్లడించింది. అయితే, ఆ క్షమాపణలను అంగీకరించని ఆ కుటుంబం న్యాయపరమైన పోరాటానికి దిగినట్లు తెలిపింది. సుదీర్ఘ చర్చల తర్వాత, ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లు చెప్పింది. ఘటనకు కారణమైన ఫెడరేషన్‌ సభ్యురాలిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)