ముగ్గురు కుకీల దారుణ హత్య

Telugu Lo Computer
0


ణిపూర్‌లో మరో ఘాతుకం చోటుచేసుకుంది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాల వైఫల్యంతో మే 3న రాష్ట్రంలో ప్రారంభమైన హింసాకాండ రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త ప్రాంతాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. తాజాగా నాగా ఆధిపత్య జిల్లా ఉఖ్రూల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు కుకీలను దారుణంగా హత్య చేశారు. హింసాకాండ ప్రారంభమైన తరువాత నాగా ఆధిపత్య జిల్లాలో ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి. థవై కుకీ గ్రామంపై ఉదయం 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని కొందరు సాయుధ దుండగులు దాడి చేశారు. ముగ్గురు గ్రామ వాలంటీర్లను దారుణంగా హత్య చేసి, మృతదేహాలను ఛిద్రం చేశారు. మృతదేహాలపై బుల్లెట్‌ గాయాలతోపాటు పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు కూడా ఉన్నాయి. మృతుల్ని థంగ్కోకై హాకిప్‌ (31), జాంఖోగిన్‌ హాకిప్‌ (35), హోలెన్‌సన్‌ బైతి (20)గా గుర్తించారు. మెయితీలే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఉఖ్రూల్‌ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ నింగ్‌షెమ్‌ వాషుమ్‌ మీడియాకు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే ఆర్మీ, పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఈ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో చెక్‌పోస్టు ఉందని తెలిపారు. కాల్పుల శబ్దం అనంతరం సమీప ప్రాంతాల్లో వెతకగా, ముగ్గురు వాలంటీర్ల మృతదేహాలు కనిపించాయని కుకీలు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ఈ గ్రామం నుంచి అస్సాం రైఫిల్స్‌కు చెందిన శిబిరాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. గ్రామంలో గతంలో ఎలాంటి దాడులు జరగకపోయినా ముందు జాగ్రత్తగా చర్యగా కుకీలు భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. కుకీలకు చెందిన వ్యక్తులే గ్రామ వాలంటీర్లుగా ఏర్పడి రక్షణ బాధ్యతలు నిర్వహించుకుంటున్నారు. మెయితీల నుంచి వచ్చిన ఒత్తిడితోనే గ్రామం నుంచి భద్రతా సిబ్బందిని తొలగించారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. నాగాలు అధికంగా ఉన్న ఈ జిల్లాలో 14 కుకీ గ్రామాలు ఉన్నాయి. హింసాకాండ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన కుకీ మహిళలు, చిన్నారులు ఈ గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. హింసను నియంత్రించడంలో విఫలమైన బీరేన్‌సింగ్‌ వెంటనే రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)