ఐపీఎస్‌ అధికారి ఎ. కోవన్ పై సస్పెన్షన్‌ వేటు !

Telugu Lo Computer
0


శాంతి భద్రతలను కాపాడాల్సిన ఐపీఎస్‌ అధికారి ఎ. కోవన్ నైట్‌ క్లబ్ లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఆ అధికారిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కాస్తా అసెంబ్లీ దాకా వెళ్లింది. దీంతో ఘటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. సదరు ఐపీఎస్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 2009 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ ఐపీఎస్ అధికారి ఎ. కోవన్ గోవాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం అక్కడి నైట్ క్లబ్‌కు వెళ్లిన కోవన్‌.. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశాన్ని గోవా ఫార్వార్డ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్‌ సర్దేశాయ్‌ అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో వేధింపులకు పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఆ నివేదికలో సదరు ఐపీఎస్‌ అధికారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో కేంద్ర హోంశాఖ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఆ అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్డర్లు పాస్‌ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. సదరు అధికారిని గోవా పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంది. ముందస్తు సమాచారం లేకుండా అక్కడినుంచి వెళ్లొద్దంటూ ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)