సిమ్‌ డీలర్లకు ఇక పోలీస్‌ వెరిఫికేషన్‌ !

Telugu Lo Computer
0


సైబర్‌ నేరాలు, మోసపూరిత ఫోన్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్‌ కార్డులు విక్రయించే డీలర్లకు మొబైల్ వెరిఫికేషన్‌ తప్పనిసరి చేసింది. అంతేగాక, బల్క్‌ సిమ్‌ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం వెల్లడించారు. ''ప్రస్తుతం కొందరు సిమ్‌ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్‌ ప్రక్రియ లేకుండానే సిమ్‌ కార్డులను విక్రయిస్తున్నారు. ఇకనుంచి అలాంటివి ఉండదు. సిమ్‌ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తున్నాం. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధించనున్నాం'' అని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్‌ డీలర్లు ఉన్నారని, వారంతా పోలీసు వెరిఫికేషన్‌ పూర్తి చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు బల్క్‌ కనెక్షన్ల నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దాని స్థానంలో బిజినెస్‌ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ''ఈ మధ్య మోసగాళ్లు 5 సిమ్‌లను తీసుకుని వాటిని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత వాటిని డియాక్టివేట్‌ చేసి మరో బ్యాచ్‌ సిమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి నేరాలను అధ్యయనం చేసిన తర్వాత బల్క్‌ కనెక్షన్ల విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాం'' అని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇకపై బిజినెస్‌ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇందులో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ''ఉదాహరణకు ఒక కంపెనీ 4వేల సిమ్‌ కార్డులను తీసుకుందనుకోండి. గతంలో కంపెనీ కేవైసీని మాత్రమే వెరిఫై చేసి ఈ సిమ్‌లను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ నాలుగు వేల ఉద్యోగుల కేవీసీలను చేసిన తర్వాత సిమ్‌కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది'' అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు 52 లక్షల మొబైల్‌ కనెక్షన్లను తొలగించామని కేంద్రమంత్రి వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్న 67వేల డీలర్లను బ్లాక్‌ చేశామని, సిమ్‌ డీలర్లపై 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సప్‌ ఖాతాలను కూడా బ్లాక్‌ చేసినట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)