నీట్‌ వ్యతిరేక బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వను !

Telugu Lo Computer
0


మిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్‌ చేయబోనని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఈ బిల్లుకు క్లియరెన్స్‌ ఇచ్చే చివరి వ్యక్తిని తానేనని, అందుకే ఎప్పటికీ దానిని క్లియర్‌ చేయనని తెలిపారు. అలాగే దేశమంతా నీట్‌ పరీక్ష ఉంటుందని చెప్పారు. నీట్‌ 2023లో టాప్‌ స్కోర్‌ సాధించిన అభ్యర్థులు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రాజభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తమిళనాడులో నీట్‌ను మినహాయించాలని కోరుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లు క్లియరెన్స్‌ గురించి నీట్‌ టాపర్‌ తండ్రి గవర్నర్‌ను అడిగారు. కాగా, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి దీనికి సమాధానమిస్తూ.. 'నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నా. నీట్ (బిల్లు)కు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను. ఇది చాలా స్పష్టం. ఏది ఏమైనప్పటికీ అది రాష్ట్రపతికి వద్దకు వెళ్ళింది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం కావడంతో క్లియరెన్స్‌ చేసే సమర్థత రాష్ట్రపతికి మాత్రమే ఉంది' అని అన్నారు. మరోవైపు నీట్‌ లేకుండా విద్యార్థులు సాధించిన విజయాలు భవిష్యత్తుకు సరిపోవని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తెలిపారు. మన పిల్లలను మేథో వికలాంగులుగా భావించడం తనకు ఇష్టం లేదన్నారు. మన పిల్లలు పోటీపడి అత్యుత్తమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, దీనిని వారు నిరూపించారని అన్నారు. అలాగే కోచింగ్‌ తీసుకున్న వారు మాత్రమే జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నీట్‌లో ఉత్తీర్ణత సాధిస్తారన్న అపోహ ప్రచారంలో ఉందని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తెలిపారు. అంతేగాక నీట్‌ ప్రిపరేషన్‌కు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఎంతో ప్రామాణికమని అన్నారు. విద్యార్థులు ఆ స్థాయికి రాణించాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)