సభ సజావుగా సాగే వరకు సమావేశాలకు హాజరుకాను ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 2 August 2023

సభ సజావుగా సాగే వరకు సమావేశాలకు హాజరుకాను !


పార్లమెంట్‌  వర్షాకాల సమావేశాలకు 'మణిపూర్‌ అల్లర్ల' అంశం ఆటంకం కలిగిస్తోంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా లోక్‌సభలో సభా కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. దీంతో సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం చెందారు. సభ సజావుగా సాగే వరకు తాను సమావేశాలకు రాలేనని ఆయన కరాఖండీగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కోసం తెచ్చిన జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ బిల్లు - 2023ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనతో స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బిల్లుపై అమిత్‌ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి విసిరేశారు. వాటిని సభాధ్యక్షుడి కుర్చీ ముందు విసిరేశారు. అటు ట్రెజరీ బెంచ్‌ సభ్యులు కూడా విపక్ష సభ్యులకు ప్రతిగా గట్టి గట్టిగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన స్పీకర్‌ బుధవారం నాటి సమావేశాలకు హాజరు కాలేదు. సభా మర్యాదను స్పీకర్‌ అత్యంత ఉన్నతంగా భావిస్తారని, సభ్యులు కూడా దాన్ని పాటించాలని కోరుకుంటున్నట్లు సభాపతి సన్నిహిత వర్గాలు చెప్పాయి. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించేవరకు తాను సమావేశాలకు హాజరుకాబోనని బిర్లా స్పష్టం చేశారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం కూడా లోక్‌సభ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే మణిపుర్‌ అంశంపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్యే కొంతసేపు ప్రశ్నోత్తరాల గంట కొనసాగింది. ఆ తర్వాత సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో సభను గురువారం ఉదయానికి వాయిదా వేశారు. వాస్తవానికి నేటి సమావేశాల్లో ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై చర్చ, ఓటింగ్‌ జరగాల్సి ఉంది. వాయిదాల కారణంగా ఈ బిల్లుపై నేడు చర్చ జరగలేదు. 

No comments:

Post a Comment