అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు !


ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబరు 18వ తేదీన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలియజేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు తిరుమలలో అన్ని వాహన సేవలు జరుగుతాయని ధర్మారెడ్డి వివరించారు. గరుడసేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరికీ దర్శనం కల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే శ్రీవారి దర్శానికి అనుమతిస్తామని ధర్మారెడ్డి వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్‌సీ, ఎస్‌టీ, బిసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. వీరికి ఉచితంగా రవాణా, భోజనం, బస టీటీడీ అధికారులు కల్పిస్తారని వివరించారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు రవాణా, వైద్యం తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల కోసం విభాగాల వారీగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామ, భక్తుల కోసం పలు ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల నుండి కళాకారులను ఆహ్వానించి వాహనసేవల ఎదుట కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి వివరించారు. వాహనసేవల ఎదుట ఏనుగులు, అశ్వాలు, వృషభాలు ప్రత్యేక అలంకరణలో పాల్గొంటాయని, వీటి నిర్వహణ కోసం కేరళ నుండి నిపుణులను రప్పిస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు.

అటవీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు నడక మార్గాల్లో ఇప్పుడున్న నిబంధనలు కొనసాగుతాయని ధర్మారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గతేడాది తరహాలోని జిల్లాలోని అన్ని విభాగాలను భాగస్వాములను చేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. టీటీడీతో సమన్వయం కోసం నలుగురు అధికారులను ఇప్పటికే ఏర్పాటు చేశామని, ఎక్సైజ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్యాక్సీలకు ధరలు నిర్ణయించి స్టిక్కర్లు అంటిస్తామని, రుయా ఆసుపత్రి, ఇతర ప్రాంతాల నుండి వైద్యులను, మందులను అందుబాటులో ఉంచుతామని వివరించారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత మాట్లాడుతూ తిరుపతిలోని రైల్వే స్టేషన్‌, బస్టాండు, భక్తులు సంచరించే అన్ని ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపడతామని తెలిపారు.

No comments:

Post a Comment