మరణ వాంగ్మూలాన్ని నిజమని నిర్ధారించలేము !

Telugu Lo Computer
0


రణ వాంగ్మూలం ఆధారంగానే నేరారోపణలు నిజమని నిర్ధారించడం సరికాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుడిని తక్షణం విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు, ఇద్దరు సోదరులు నిద్రిస్తున్న గదికి నిప్పంటించి వారిని హత్య చేశాడన్న ఆరోపణలను నిర్ధారిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన నిందితుడు ఇర్ఫాన్‌కు 2017లో ట్రయల్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఇర్ఫాన్‌ సోదరుల మరణ వాంగ్మూలాలను ఇందుకు ఆధారంగా పేర్కొంది. రెండో వివాహానికి తన మొదటి భార్య కుమారుడు, సోదరులు అడ్డుగా నిలుస్తున్నారనే కారణంతోనే ఈ దారుణానికి నిందితుడు పాల్పడ్డాడని తన తీర్పులో తెలిపింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ప్రశాంత కుమార్‌ మిశ్రల సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఈ తీర్పుతో ఏకీభవించలేదు. మరణశయ్యపై ఉన్న ఇర్ఫాన్‌ ఇద్దరు సోదరులిచ్చిన వాంగ్మూలాలపై అనుమానం వ్యక్తం చేసింది. చనిపోయే ముందు వ్యక్తి కచ్చితంగా నిజమే చెబుతాడని అనుకోలేమని.. ఇందులో నిజానిజాలను న్యాయస్థానాలు మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సాక్షుల వాంగ్మూలాలకు, మరణ వాంగ్మూలాలకు మధ్య తేడాలు ఉన్నాయని తెలిపింది. ఈ సందర్భంగా 36 పేజీల తీర్పులో మరణవాంగ్మూలాల చట్టబద్ధత, విశ్వసనీయతపై కొన్ని కీలక అంశాలను వివరించింది. ''మరణవాంగ్మూలం నమ్మదగినదని, విశ్వసించదగినదని అనిపించాలి. దాని ప్రామాణికతపై ఏ మాత్రం అనుమానం ఉన్నా దాన్ని కేవలం ఓ సాక్ష్యంగానే పరిగణించాలి.శిక్ష వేయడానికి అది ఆధారం కాకూడదు'' అని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)