వర్ష బీభత్సానికి రూ.10వేల కోట్ల నష్టం !

Telugu Lo Computer
0


హిమాచల్‌ ప్రదేశ్‌కు భారీ వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. జులై నెలలో సంభవించిన జల ప్రళయాన్ని మరవకముందే రాష్ట్రంలో మరోసారి భీకర వరదలు సంభవించాయి. ఈ విపత్తు వందల మంది ప్రాణాలను బలితీసుకోగా, వేల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కోలుకునేందుకు తమకు కనీసం ఏడాది సమయం పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు  బుధవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్‌లో భారీ వర్షాలు హిమాచల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వర్షాలు, వరదల  కారణంగా ఇప్పటివరకు తాము రూ.10వేల కోట్ల ఆస్తి నష్టాన్ని చవిచూశామని సీఎం సుఖ్వీందర్‌ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. గడిచిన మూడు రోజుల్లోనే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ''ఇప్పుడు మేం పర్వతమంత సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు మరో ఏడాది సమయం పట్టొచ్చు. కానీ మేం వెనుకడుగు వేయట్లేదు. వీలైనంత వేగంగా మౌలిక సదుపాయలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)