కులవివక్ష కారణంగా అన్యాయం జరిగిన మాట వాస్తవం !

Telugu Lo Computer
0


దేశంలో గతంలో కులవివక్ష లేదు, అసలు కులాలే లేవు. మొఘల్స్, బ్రిటిషర్లు వంటి వారు వచ్చాక వారి స్వార్థాల కోసం కులాలను సృష్టించారనే వాదన సోషల్ మీడియాలో తరుచూ వినిపిస్తుంటుంది. దీన్ని చాలా మంది మద్దతు ఇస్తుంటారు. ఏ ఉద్దేశంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారో, లేదంటే చరిత్ర మీద అవగాహన లేక ఇలాంటి ప్రచారంలో పడిపోతున్నారో తెలియదు కానీ, వందల ఏళ్ల నుంచే ఈ దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష రెండూ ఉన్నాయనేది ఎవరూ కాదనలేని విషయం. తాజాగా ఇదే విషయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.  గతంలో కులవివక్ష లేదనే భావనకు కొంతమంది మద్దతు ఇస్తున్నారని, కానీ మన దేశంలో కులవివక్ష కారణంగా అన్యాయం జరిగిన మాట వాస్తవమని, దాన్ని ఈ దేశ ప్రజలు అంగీకరించాలని ఆయన అన్నారు. తాజాగా 'సంఘ్ శిక్ష వర్గ్' (ఆర్ఎస్ఎస్ అధికారుల శిక్షణ కార్యక్రమం) నిర్వహించారు. దానికి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ''ఏమున్నాయో వాటిని చెప్పి తీరాలి, ఏమీ లేవో అవి లేవని కూడా చెప్పాలి. మన దేశంలో గతంలో కుల వివక్ష లేదని కొందరు అంటున్నారు. దానికి మరికొంత మంది మద్దతు ఇస్తున్నారు. ఇది సరైంది కాదు. ఈ దేశంలో కుల వివక్ష ఉంది. కుల వివక్ష కారణంగా కొంత మంది ప్రజలకు అన్యాయం జరిగింది. దాన్ని మనం అంగీకరించి తీరాలి. అలాంటి తప్పులు జరక్కుండా చూడాలి'' అని అన్నారు. ఇక మన దేశానికి గొప్ప వారసత్వ సంపద ఉందని, దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భగవత్ పిలుపునిచ్చారు. కుల వ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. మొఘల్స్ ఈ దేశాన్ని వదిలిపెట్టినప్పటికీ వందల ఏళ్లుగా ఈ దేశంలో ఇస్లాం సురక్షితంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతర్గత కుమ్ములాటలు వదిలేసి, మనతో మనమే యుద్ధాన్ని ఆపేసి బయటి శత్రువులతో పోరాడాలని భగవత్ పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)