ఆది కైలాష్‌లో చిక్కుకుపోయిన 200 మంది భక్తులు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా పితోరాగఢ్ జిల్లాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో  చార్‌ధామ్ యాత్రకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆది కైలాష్ పర్వతాన్ని సందర్శించడానికి వెళ్లిన భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఉత్తరాఖండ్ పితోరాగఢ్ జిల్లా నజంగ్ సమీపంలో ఉంటుంది ఆది కైలాస్. నేపాల్ సరిహద్దుల్లో  హిమాలయ పర్వత పంక్తుల మధ్య సాక్షాత్ మహాశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. శివ కైలాస్, ఛోటా కైలాస్, బాబా కైలాస్‌గా పిలుస్తుంటారు భక్తులు. మానస సరోవరం, కైలాస పర్వతాన్ని తిలకించడానికి వెళ్లలేని భక్తులు ఆది కైలాస్‌ను సందర్శిస్తుంటారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. తాజాగా ఆది కైలాస్‌ను సందర్శించడానికి 300 మందికి పైగా భక్తులు వెళ్లారు. అదే సమయంలో పితోరాగఢ్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. పితోరాగఢ్-లిపులేఖ్ హైవే పాస్‌లో పలుచోట్ల రోడ్డు మూసుకుపోయింది. ప్రత్యేకించి నజంగ్ వద్ద భారీ ఎత్తున కొండచరియలు విరిగి- రోడ్డుపై పడ్డాయి. ఫలితంగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. ఆది కైలాస్‌తో సంబంధాలు తెగిపోయాయి. అక్కడ చిక్కుకుపోయిన ఆది కైలాస్ యాత్రీకులను రక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అధికార, పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను మోహరింపజేసింది. బుల్ డోజర్లు, జేసీబీలతో రోడ్లపై పడిన బండరాళ్లను తొలగిస్తోన్నారు సిబ్బంది. హెలికాప్టర్ల అత్యవసర వైద్య సహాయాన్ని అందిస్తోన్నారు. ఆది కైలాస్‌కు దారి తీసే రోడ్డు సుమారు వంద మీటర్ల మేర ధ్వంసమైనట్లు ధార్చులా అసిస్టెంట్ కలెక్టర్ షష్ని తెలిపారు. ధార్చులా నుంచి నపాల్చు, గూంజీ, బుందీ మార్గాల్లో కొండచరియలు విరిగినట్లు వివరించారు. ఆది కైలాస్ నుంచి తిరుగుముఖం పట్టిన యాత్రికులు చిక్కుకుపోయారని, ఇప్పటివరకు 120 మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)