ఐసియులో తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ

Telugu Lo Computer
0


తమిళనాడు విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖల మంత్రి వి. సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో బుధవారం తెల్లవారుజామున మంత్రిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసంలో 18 గంటలపాటు విచారించిన అనంతరం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్ట్‌ చేస్తుండగా.. ఆ సమయంలో బాలాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈడీ అధికారులు మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిఎంకె మద్దతుదారులు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనంలో మంత్రి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. మంత్రులు ఉదయనిధి స్టాలిన్‌, ఎం సుబ్రమణియన్‌, ఈవీ వేలు ఆసుపత్రిని సందర్శించారు. సెంథిల్‌ బాలాజీ అపస్మారక స్థితిలో ఉన్నారని, ఐసీయూలో పరిశీలనలో ఉన్నారని మంత్రి శేఖర్‌ బాబు తెలిపారు. మరోవైపు సెంథిల్‌ బాలాజీ అరెస్టు గురించి తమ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది ఎలాంగో విమర్శించారు. మంత్రి అరెస్ట్‌ నేపథ్యంలో ఒమందూరర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌ వద్ద అదనపు బలగాలను మోహరించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. సెంథిల్‌బాలాజీకి చెందిన పలుప్రాంతాల్లో మంగళవారం ఈడి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడవటంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభివర్ణించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధాన చెప్పలేక దొడ్డి దారిన వచ్చి మరీ దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)