ప్రొటీన్‌ షేక్‌ తాగి బాలుడు మృతి !

Telugu Lo Computer
0


బ్రిటన్ లోని పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌లో రోహన్ గోధానియా (16) అనే బాలుడు మూడేళ్ల క్రితం ప్రొటీన్ షేక్ తాగి మృత్యువాతపడ్డాడు. ప్రొటీన్ షేక్ తాగిన రోజుల వ్యవధిలోనే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ప్రొటీన్‌ షేక్ తాగడం వల్లనే బాలుడికి మెదడు దెబ్బతిని, ప్రాణాలు కోల్పోయినట్లు తాజా కోర్టు విచారణలో బయటపడింది. ఈ విషాద ఘటన ఆగస్టు 15, 2020న చోటుచేసుకున్నప్పటికీ మృతికి గల కారణాలు తాజాగా జరిగిన న్యాయ విచారణలో వెలుగు చూశాయి. రోహన్ చిన్నతనం నుంచి చాలా సన్నగా ఉండేవాడు. దీంతో బలం వచ్చేందుకు బాలుడి తండ్రి ప్రోటీన్ షేక్‌ ఇవ్వడం ప్రారంభించాడు. ఐతే ప్రొటీన్‌ షేక్ తీసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే రోహన్ ఆరోగ్యం వేగంగా క్షీణించింది. దీంతో వెస్ట్ మిడిల్సెక్స్ ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల వ్యవధిలోనే రోహన్‌ మరణించాడు. ఐతే రోహన్ మరణానికి కారణం మొదట్లో తెలియరాలేదు. రోహన్‌ మృతి అనంతరం అతని అవయవాలను దానం చేయడమే అందుకు కారణం. రోహన్‌ మృతిపై తాజాగా జరిపిన న్యాయ విచారణలో ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్  లోపం వల్ల అరుదైన జన్యు స్థితికి గురై మరణించినట్లు తేలింది.

అందుకు ప్రొటీన్‌ షేక్‌లోని అధిక ప్రోటీన్ కంటెంట్‌ కారణమని వెల్లడించింది. దీని ప్రభావంతో రోహన్ శరీరంలోని రక్తప్రవాహంలో అమ్మోనియా వేగంగా విచ్ఛిన్నమై మెదడు దెబ్బతినిందని, అందుకే బాలుడు మృతి చెందినట్లు తేలింది. బాలుడి మృతి అనంతరం అవయవ దానం కారణంగా రోహన్‌ మరణానికి ఓటీసీ కారణమని అప్పట్లో గుర్తించలేకపోయారు. ఈ వివరాలన్నీ మిల్టన్ కీన్స్ కరోనర్ కోర్టులో విచారణ సందర్భంగా వెల్లడయ్యాయి. ‘రోహన్‌ చాలా తెలివైనవాడు. ఐతే చాలా సన్నగా ఉండేవాడు. కేవలం కండరాలను పెంచడానికి మాత్రమే నేను దానిని తాగించాను. నా చేతులతో నేను నా కొడుకును చంపుకున్నట్లైంది’ అంటూ బాలుడి తండ్రి కన్నీటి పర్యాంతమయ్యాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)