ఇవేం ఉత్తర్వులు ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 May 2023

ఇవేం ఉత్తర్వులు ?


ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఓవైపు సీబీఐ వరుసగా అరెస్టులు చేస్తూ నిందితుల్ని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో నిందితులు కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. గతంలో బెయిల్ పై బయటికి వచ్చిన మరి కొందరు నిందితుల్ని తిరిగి జైల్లో పెట్టించేందుకు సీబీఐ కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఓ నిర్ణయంపై సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివేకా కేసులో ప్రధాన నిందితుడు, ఏ1 అయిన ఎర్ర గంగిరెడ్డికి గతంలో కోర్టు సీబీఐ విచారణ 90 రోజుల్లో పూర్తి కాకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇలా బెయిల్ పై ఉన్న గంగిరెడ్డిని సీబీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేసి తిరిగి జైలుకు పంపింది. అయితే ఈ ఆదేశాలు ఇచ్చే క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఓ వెసులుబాటు వివాదాస్పదమైంది. గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ ఆయన మే 5లోగా లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే మే 5న గంగిరెడ్డి లొంగిపోయినా సుప్రీంకోర్టు ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు జూన్ 30 ముగియగానే తిరిగి ఆయనకు బెయిల్ ఇస్తామంటూ తెలంగాణ హైకోర్టు చేసిన ప్రస్తావనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీరుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు సునీతారెడ్డి పిటిషన్ ను తదుపరి విచారణ కోసం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కు బదిలీ చేస్తూ సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు సంబంధించిన వ్యవహారంలోనూ తెలంగాణ హైకోర్టు తీరుపై సీజే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వకపోయినా, నిర్ణీత తేదీలోగా అరెస్టు చేయకుండా సీబీఐని నిలువరిస్తూ అప్పట్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీజే తప్పుబట్టారు.

No comments:

Post a Comment