మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య వాగ్వాదం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మేడ్చల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి, మాజీ ఎమ్మెల్యేల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మంత్రి మల్లారెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ శరత్ చంద్రారెడ్డిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు పిలవడం లేదని మండిపడ్డారు. చంద్రారెడ్డితోపాటు ఇతర బీఆర్ఎస్ నేతలకు కూడా సమావేశాలకు పిలుపు అందడం లేదని సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి తన హయాంలో కూడా జరిగిందని సుధీర్ రెడ్డి చెప్పారు. కానీ, ఆ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి చెప్పడం లేదని మండిపడ్డారు. అయితే, సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగానే వేదికపైనే ఉన్న మంత్రి మల్లారెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. సుధీర్ రెడ్డి వద్ద నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారిద్దరికీ సర్దిచెప్పారు. ఆ తర్వాత కూడా సుధీర్ రెడ్డి మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని మంత్రి మల్లారెడ్డి తనకు తానే ప్రచారం చేసుకోవడం ఏంటని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. అధిష్టానం ఏమైనా చెప్పిందా? అని నిలదీశారు. మరోవైపు, మంత్రి మల్లారెడ్డి మాట్లతాడుతూ మేడ్చల్ నియోజకవర్గానికి తాను వాచ్‌మెన్‌లా పనిచేస్తున్నానని చెప్పారు. ఈ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. బోడుప్పల్ వక్ఫ్ బోర్డ్ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఒరిగేది ఏం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)