ప్రధానమంత్రి సీటు ఖాళీగా లేదు !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి సీటు ఖాళీగా లేదని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమాగా చెప్పారు. ఆయన ఆదివారం సాయంత్రం చేవెళ్లలో ఏర్పాటు చేసిన 'బీజేపీ విజయ సంకల్ప సభ'లో పాల్గొని ప్రసంగించారు. ఆద్యంతం కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరుగుతూ, దేశం తమ నాయకత్వంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. ''ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన బండి సంజయ్‌ని జైల్లో వేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. మేం వెనక్కి తగ్గం. కేసీఆర్‌ను గద్దె దింపేంత వరకు పోరాడతాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు'' అని చెప్పారు. ''అన్ని రంగాల్లో తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతోంది. ఉద్యోగ నియామకాల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. 55 వేల మంది యువతీయువకుల భవిష్యత్తు నాశనమైంది. లీకేజీలపై సమగ్ర దర్యాప్తుకు కేసీఆర్ ఎందుకు నిరాకరిస్తున్నారు? సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించలేదు?'' అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని, తాము దాడులకు అరెస్టులకు భయపడే రకం కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో కోట్ల నిధులు ఇచ్చిందని, వాటిని వాడుకుంటూ, ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. ''రైల్వేలకు వేల కోట్లు ఇచ్చాం. రామంగుండానికి 62 కోట్లు విడుదల చేశాం. ఎంఎంటీఎస్ రైళ్లను వికారాబాద్ వరకు విస్తరిస్తున్నాం. హైవేలను విస్తరిస్తున్నాం. అయినా ఏమీ చేయడం లేదంటున్నారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల్లో ఏం చేయాలో వాళ్లకు తెలుసు'' అని అన్నారు. సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)