విద్వేషపూరిత ప్రచారం కోసమే 'ది కేరళ స్టోరీ' సినిమా !

Telugu Lo Computer
0


మే 5న విడుదల కానున్న 'ది కేరళ స్టోరీ' సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్‌ మండిపడ్డారు. తమ రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రచారం కోసం ఈ సినిమాను రూపొందించారని ఆయన ఆరోపించారు. 'లవ్‌ జిహాద్‌' కథాంశంగా తీసిన ఈ తప్పుడు సినిమా 'సంఘ్ పరివార్' అబద్ధాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అని దుయ్యబట్టారు. 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. లౌకికవాద దేశంలో మతపరమైన తీవ్రవాదం వ్యాప్తి కోసం ఏర్పడిన ఆర్ఎస్‌ఎస్‌, ఈ చిత్రం ద్వారా దానిని మరింతగా వ్యాప్తి చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. 'తప్పుడు కథనాలు, సినిమాల ద్వారా విభజన రాజకీయాలను వ్యాప్తి చేసేందుకు సంఘ్ పరివార్ వారు  ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి వాస్తవం, ఆధారాలు లేకుండా సంఘ్ పరివార్ ఇలాంటి అపోహాలు ప్రచారం చేస్తోంది. కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతంలోకి మారి ఇస్లామిక్ స్టేట్‌లో చేరారనేది పెద్ద అబద్ధం. ఈ సినిమా ట్రైలర్‌లో మనకు చూపించింది ఇదే. ఈ తప్పుడు కథ 'సంఘ్ పరివార్' అబద్ధాల ఫ్యాక్టరీ ఉత్పత్తి' అని విమర్శించారు. కేరళ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు సంఘ్ పరివార్ చేస్తున్న వివిధ ప్రయత్నాల్లో భాగమే ఈ తప్పుడు సినిమా అని సీఎం విజయన్‌ మండిపడ్డారు. 'లవ్‌ జిహాద్‌' ఆరోపణలను దర్యాప్తు సంస్థలు తిరస్కరించాయని అన్నారు. 'లవ్‌ జిహాద్‌' అన్నది ఏదీ లేదని గతంలో కేంద్ర హోంమంత్రి పార్లమెంట్‌లో సమాధానమిచ్చారని తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి తప్పుడు ఆరోపణలతో సినిమాను రూపొందించడం ప్రపంచ వ్యాప్తంగా కేరళను అవమానించాలన్న ఆత్రుతేనని దుయ్యబట్టారు. కేరళలో మత సామరస్య వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి మతవాద విషాన్ని వ్యాపింపజేయడానికి బీజేపీ మాతృసంస్థ సంఘ్ పరివార్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అయితే ఇతర ప్రాంతాల్లో మాదిరిగా 'పరివార్‌ రాజకీయాలు' కేరళలో పని చేయవని అన్నారు. మరోవైపు దేశంలో మతతత్వం, వివక్షను సృష్టించేందుకు మాత్రమే సినిమాలను ఉపయోగించుకునే వారిని సమర్థించడం సరికాదని కేరళ సీఎం విజయన్‌ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఈ దేశాన్ని వర్గీకరించడానికి, తప్పులను వ్యాప్తి చేయడానికి, ప్రజలను విభజించడానికి లైసెన్స్ కాదని వ్యాఖ్యానించారు. అలాంటి మతపరమైన విభజనలను తిరస్కరించాలని మలయాళీలను అభ్యర్థించారు. తప్పుడు ప్రచారం ద్వారా సమాజంలో అశాంతి సృష్టించే మతపరమైన ప్రయత్నాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 'ది కేరళ స్టోరీ' సినిమాను తప్పుపట్టాయి. భావప్రకటనా స్వేచ్ఛ అనేది సమాజంలో విషం చిమ్మడానికి లైసెన్స్ కాదని విమర్శించాయి. రాష్ట్రంలో మత సామరస్యాన్ని నాశనం చేసే ప్రయత్నమే ఈ సినిమా అని ఆరోపించాయి. తప్పుడు వాదనల ద్వారా సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతో నిర్మించిన వివాదాస్పద 'ది కేరళ స్టోరీ' సినిమాను ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వవద్దని సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు డిమాండ్‌ చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)