యువతిపై కుటుంబ సభ్యుల యాసిడ్ దాడి !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌ లోని, ఫతేఘంజ్‌ లో మంగళవారం ఉదయం అగరాస్‌ గ్రామ శివారు ప్రాంతంలోని రోడ్డు పక్క పొదల్లో ఓ యువతి నగ్నంగా పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు పక్క పొదల్లో నగ్నంగా పడి ఉన్న యువతి ముఖం, ఇతర శరీరం బాగా కాలిపోయి ఉంది. ఆమె బతికే ఉందని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కొద్దిగా కోలుకుంది. అయితే, మాట్లాడే స్థితిలో లేదు. దీంతో పోలీసులు తమ విచారణలో మార్పు చేశారు. ఆమె చేతికి పెన్ను ఇచ్చి వివరాలను అడిగారు. ఆ యువతి తన పేరు మున్నీ దేవి అని, తన తండ్రి పేరు తోతారామ్‌ అని, తనది తానాసాహి గ్రామం అని చెప్పింది. యువతి చెప్పిన వివరాలతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో బెడ్‌పై పడి ఉన్న మున్నీని చూసి విలవిల్లాడిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ చేస్తుండగా వారికి యువతి మరిదిపై అనుమానం వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మున్నీ తండ్రి, భర్త, మరది కలిసి ఆమెపై యాసిడ్‌ దాడికి దిగినట్లు వెల్లడైంది. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు ఏం చెప్పారంటే మున్నీ, అజయ్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. గతంలో ఓ రెండు సార్లు అతడితో ఇంటినుంచి పారిపోయింది. ఈ నేపథ్యంలో తోతారామ్‌, మున్నీని ఆమె బావ దేవేంద్రకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. ఆదివారం రోజు తోతారామ్‌ మున్నీని తీసుకుని అత్తింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మున్నీ తన భర్త ఫోన్‌ నుంచి ప్రియుడు అజయ్‌కి ఫోన్‌ చేసింది. తన ప్రియుడితో వెళ్లిపోతానని అత్తింటి వారితో గొడవ పెట్టుకుంది. తండ్రి, అత్తింటి వాళ్లు ఆమెకు ఎంతగానో నచ్చ చెప్పాలని చూశారు. అయినా ఆమె వినలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం వారంతా ఓ దారుణమైన నిర్ణయానికి వచ్చారు. మున్నీని చంపాలని నిశ్చయించుకున్నారు. ఆమెను ఊరికి దూరంగా తీసుకెళ్లి నగ్నంగా చేశారు. ముఖం, ఒంటిపై యాసిడ్‌ పోశారు. తర్వాత గొంతునులిమారు. మున్నీ చనిపోయిందని ధ్రువీకరించుకున్న తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్న మున్నీ నేలపై పాకుతూ రోడ్డు దగ్గరకు వచ్చింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంత జరిగినా ఆమె తన కుటుంబసభ్యుల పేర్లు పోలీసులకు చెప్పకపోవటం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)