బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే జాతీయ హోదా రద్దు

Telugu Lo Computer
0


బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీల జాతీయ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సీపీఐ పార్టీకి ఈసీ జాతీయ పార్టీ హోదా రద్దు చేయడంపై నారాయణ స్పందించించారు. కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐకి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసినంత మాత్రాన ప్రజల నుంచి తమను రద్దు చేయలేరని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయం 1925లో పుట్టిన పార్టీ సీపీఐ అని వెల్లడించారు. స్వాతంత్య్రఉద్యమంలో అనేక మంది పోరాడిన పార్టీ అని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన పార్టీ సీపీఐ అని వెల్లడించారు. దేశం సమైక్యంగా ఉండాలని అనేక త్యాగాలు చేసిన పార్టీ సీపీఐ అని కొనియాడారు. సాంకేతికపరమైన కారణాలతో సీపీఐకి జాతీయ హోదా రద్దు చేయడం అన్యాయం అన్నారు. రాజకీయ చరిత్ర, సాంఘిక పరిస్థితులు తెలుసుకోకుండా ఈసీ తీసుకున్న నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని.. ఈసీ నిర్ణయాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. దేశంలో 26 రాష్ట్రాల్లో సీపీఐ పార్టీ సజీవంగా ఉంది..సీపీఐకి సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఓట్ల శాతం లెక్కించి ఏ విధంగా పార్టీకి గుర్తింపు ఇస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు బీజేపీకి రెండు స్థానాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వారం క్రితమే తాను, డి. రాజా వెళ్లి ఈసీ ముందుకు వెళ్లి జాతీయ హోదా రద్దుపై వివరణ ఇచ్చామని తెలిపారు. 2024 ఎన్నికలు రాబోతున్నాయని.. ఇప్పుడు జాతీయ హోదా రద్దు నిర్ణయం వద్దని చెప్పామని తెలిపారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కూడా తప్పిదాలు ఉన్నాయని తెలిపారు. లెఫ్ట్ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. సీపీఐకి జాతీయ హోదా రద్దు చేయడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా నియమితులై సీపీఐకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సీపీఐ చట్టసభల్లో ఎందుకు బలపడలేక పోయిందనేది మరొక అంశం దానిపై తరువాత మాట్లాడతామని పేర్కొన్నారు. బీజేపీని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపులు జరుగుతున్నాయని.. అందుకే టీఎంసీ, ఎన్సీపీ పార్టీల జాతీయ హోదా కూడా రద్దైందని వెల్లడించారు. న్యాయస్థానాల్లో ఎటువంటి తీర్పు వచ్చినా సీపీఐ ప్రజల్లో ఉంటుందని, ప్రజల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీల జాతీయ పార్టీ హోదా రద్దు చేస్తూ సోమవారం ఏప్రిల్10న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఏర్పాటు అయింది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉంది. అయితే, అతి తక్కువ కాలంలోనే మొదటగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చి రికార్డు నెలకొల్పింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు కోల్పోయింది. కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తమ నిర్ణయాలను ప్రకటించింది. రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ, ఏపీలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ తెలంగాణలో మాత్రమే పోటీ చేసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో పార్టీకి సంబంధించి పలుమార్లు సమాచారం ఇవ్వాలని ఈసీ కోరినా బీఆర్ఎస్ స్పందించలేదు. అదే అంశాన్ని సీఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల గుర్తులు( రిజర్వేషన్, కేటాయింపులు) రద్దు చేస్తూ 1968 ఆర్డర్ ప్రకారం ఈసీ నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)