మధ్యప్రదేశ్ ‎లో బీజేపీ భారీ రిక్రూట్‎మెంట్ స్కాం ?

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ ‎లో మరో భారీ జాబ్ స్కాం బయటపడింది. సెలక్ట్ అయిన అభ్యర్థులను పక్కన పెట్టి, తమకు నచ్చిన వారిని, తమ కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టారు. దాంతో అసలైన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. మధ్యప్రదేశ్‎ ప్రభుత్వం 89 బ్లాక్ కో-ఆర్డినేటర్స్‌, జిల్లా కో-ఆర్డినేటర్స్‌ పోస్టుల భర్తీకి 2021 నవంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియను ప్రభుత్వ సంస్థ సీఈడీఎంఏపీకి అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగం కావడం, జిల్లా కో-ఆర్డినేటర్‌ ఉద్యోగానికి రూ.30 వేలు, బ్లాక్‌ కో-ఆర్డినేటర్‌ పోస్టుకు రూ.25 వేల చొప్పున నెల జీతం ఉండటంతో దాదాపు 10 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్హతలు, మార్కుల ప్రాతిపదికన 890 మందితో కూడిన మెరిట్‌ జాబితాను ఫిబ్రవరి 4న ప్రభుత్వం విడుదల చేసింది. అదే నెల 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూలకు రావాలని పేర్కొంది. కాగా.. ఉన్నట్టుండి అభ్యర్థులకు ఇంటర్వ్యూ వాయిదా పడిందని అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. ఇంటర్వూ ఎప్పుడు నిర్వహిస్తారా అని వేచి చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం షాకిచ్చింది. 89 జిల్లా, బ్లాక్‌ కో-ఆర్డినేటర్‌ పోస్టుల నియామక ప్రక్రియతో పాటు అభ్యర్థులకు శిక్షణ కూడా పూర్తయిందని గత మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులెవ్వరి పేర్లూ గతంలో ఇంటర్వ్యూ కోసం సిద్ధం చేసిన మెరిట్‌ జాబితాలో కనిపించకపోవడం గమనార్హం. దాంతో అభ్యర్థులు రోడ్డేక్కడంతో అసలు విషయం బయటపడింది. తమకు నచ్చిన వారితో ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తేలింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 89 మందిలో 88 మంది రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) సభ్యులు, కార్యకర్తలేనని ఓ వార్తాపత్రిక ప్రచురించింది. వీరిలో కొంతమంది అసలు ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేయలేదని తెలిసింది. వీళ్లంతా బర్వానీ, దిందోరీ, అలిరాజ్‌పూర్‌, ధార్‌, ఖర్‌గావ్‌, షాహ్‌దోల్‌, రాత్‌లామ్‌, నర్మదాపురం, మండ్లా, అనుప్పూర్‌, బేతుల్‌, చింద్వారా, ఖాండ్వా వంటి గిరిజనులు ఎక్కువగా ఉండే జిల్లాలకు చెందినవారని తెలుస్తున్నది. సీఈడీఎంపీ సంస్థ ఈ రిక్రూట్‌మెంట్‌ బాధ్యతలను ఎంపీసీవోఎన్‌ అనే అవుట్‌ సోర్సింగ్‌ సంస్థకు ఇచ్చినట్టు సమాచారం. ఆ సంస్థ ఈ ఉద్యోగాలను గుట్టు చప్పుడు కాకుండా బీజేపీ కార్యకర్తలతో నింపేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)