30 సంవత్సరాల లీజుకు ఓఆర్‌ఆర్‌ ఖరారు !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ మహానగరానికి మణిహారమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు దీర్ఘకాల లీజు గురువారం ఖరారైంది. టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీవోటీ) విధానంలో 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించారు. తొలుత నాలుగు కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక, ఆర్థిక బిడ్ల పరిశీలన తర్వాత ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ ఎల్‌1గా నిలిచింది. మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్‌ ఖరారైంది. ఈ మొత్తం ఒకేసారి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. లీజు కుదరడంతో ఇక నుంచి నిర్వహణ నుంచి టోల్‌ వసూలు వరకు ప్రైవేట్‌ సంస్థ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఓఆర్‌ఆర్‌ను మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానమై ఉన్నాయి. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కి, దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్‌ ఛేంజ్‌ జంక్షన్లు ఉన్నాయి. నిత్యం 1.30 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్‌ వసూళ్ల కింద ఏటా రూ.400-450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఏటా 5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఔటర్‌ను లీజుకు ఇచ్చేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఏడాదిగా కసరత్తు చేస్తోంది. ఇందుకు టెండర్లను పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు విధించింది. తొలుత 11 కంపెనీలు ఆసక్తి చూపించినా.. చివరికి నాలుగే పోటీలో నిలిచాయి. ఇందులో ఈగల్‌ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, దినేశ్‌ చంద్ర ఆర్‌ అగర్వాల్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, గవార్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను టీవోటీ పద్ధతిలో లీజుకు అప్పగించారు. ఇదే విధానాన్ని అనుసరించాలని హెచ్‌ఎండీఏ గతంలో నిర్ణయించింది. తద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)