పెరుగుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులు !

Telugu Lo Computer
0


దేశంలోని చాలా మందిలోనూ కొవిడ్ తరహా లక్షణాలు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దగ్గు, జలుబుతో ఇప్పటికే చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారని ఐఎంఏ వెల్లడించింది. దేశంలోని అనేక ప్రాంతాలలో గత రెండు నెలల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో అధిక సంఖ్యలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్నాయి. రెండు సంవత్సరాల కొవిడ్ మహమ్మారి అనంతరం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దేశంమంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఈ వైరస్ వల్లనే దేశంలో గత రెండు, మూడు నెలలుగా ఈ తరహా కేసులు వస్తున్నాయని వెల్లడించింది. ఈ వ్యాధికి గురైన బాధితుల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా చాలా సమయం పడుతోంది. రోగి కోలుకున్న తర్వాత కూడా లక్షణాలు చాలా కాలం పాటు ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ వల్ల అంతగా భయపడేదేంలోదని, ప్రాణాపాయం కూడా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ కొంతమంది శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇది కూడా కొవిడ్ లక్షణాలనే పోలి ఉంటున్నాయంటున్నారు. వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు అనుసరించాల్సిన విధులను కూడా ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. మరోవైపు దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సూచించింది. యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణ చికిత్సను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. తాము ఇప్పటికే కొవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను విస్తృతంగా ఉపయోగించడాన్ని చూశామని తెలిపింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్‌ఫెక్షన్ బ్యాక్టీరియా కాదా అని నిర్ధారించడం అవసరం అని వైద్య సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)