రాహుల్‌గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి ?

Telugu Lo Computer
0


లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో దేశాన్ని తక్కువచేసి మాట్లాడినందుకు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార కూటమి పట్టుబట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా రాహుల్‌గాంధీ ప్రసంగం పేరుతో ప్రభుత్వం ఎదురు దాడి చేస్తున్నదని విమర్శిస్తున్నాయి. తాజాగా ఉద్ధవ్‌ థాకరే వర్గం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పరని, అయినా ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలని సంజయ్‌ రౌత్‌ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు చెప్పాలంటే బీజేపీకి చెందిన చాలా మంది కేంద్రమంత్రులు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందన్నారు. పార్లమెంటులో వాదన వినిపించకుండా విపక్ష ఎంపీల మైకులు కట్‌ చేయడం, అయినా నోరు మూయకపోతే జైలుకు పంపించడం బీజేపీ సర్కారుకు అలవాటుగా మారిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు నియమాలను పాటించడంగానీ, న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వడంగానీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవడంగానీ జరగలేదని సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు. ఆఖరికి సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యకలాపాల్లో, న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో లా అండ్‌ ఆర్డర్‌ను పూర్తిగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందని ఫైరయ్యారు. ప్రస్తుతం భారతదేశ న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడిందని రౌత్ వ్యాఖ్యానించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ‘మేం చెప్పినట్లు చేయకపోతే, మేమూ చూస్తాం’ అని న్యాయవ్యవస్థపై బెదిరింపు ధోరణి వ్యాఖ్యలు చేయడం దారుణమని చెప్పారు. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారని, కానీ ఒత్తిళ్లు ఉన్నాయని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)