ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం గవర్నర్ ప్రసంగం పూర్తయింది. ఈ నెల 24 వరకూ 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశమైంది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే 20 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయబద్ధత కల్పించే బిల్లుతో పాటు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపే చట్టసవరణ బిల్లు, కొత్త పారిశ్రామిక విధానానికి ఆమోదం, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు 6 వేల జీతం ఇచ్చేలా నైట్ వాచ్ మెన్ ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నిర్ణయం, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ కు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం వంటివి ఉన్నాయి. అలాగే ఆలయాల పాలకమండళ్లలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటుచేసే అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి 11 మండలాల్లోని 120 గ్రామాలు,2 మున్సిపాలిటీలను తీసుకురానున్నారు. అలాగే మరికొన్ని కీలక బిల్లులు, నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటి ప్రకారం రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోనుంది. అనంతరం వీటిని మండలికి పంపి అక్కడా ఆమోదం తీసుకోవాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)