రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు రెండెళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన మరుసటి రోజే  తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 'దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?' అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ సూరత్‌ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారించిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల పాటు జైలు శిక్షవిధించింది. రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడినవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ గాంధీ ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలిన తేదీ నుంచి అనర్హుడైనట్టు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ స్పందించారు. లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ''లోక్‌సభ సచివాలయం ఒక ఎంపీపై అనర్హత వేటు వేయరాదు. రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌తో సంప్రదించిన తర్వాత చేయాల్సి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)