పార్లమెంటుకు హాజరైన రాహుల్‌ గాంధీ

Telugu Lo Computer
0


పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష తర్వాత శుక్రవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యారు. అధికార, ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం రాహుల్‌ వెళ్లిపోయారు. జైలు శిక్ష నేపథ్యంలో ఆయన ఎంపి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందా లేదా ఎంపి పదవి పూర్తయ్యే వరకు వెలుసుబాటు ఉంటుదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది. నేరం రుజువైతే ఎంపిలు తమ సభ్యత్వం కోల్పోవలసి వస్తుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 8(1) ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడితే వారు ఆ పదవికి అనర్హులవుతారు. అయితే వీటిలో వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించడం, లంచం తీసుకోవడం, అత్యాచారం, మహిళల పట్ల అసభ్య కర ప్రవర్తన, క్రూరత్వం వంటి నేరాలు ఉన్నాయి. సూరత్‌ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పులో పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్‌కి 30 రోజుల గడువు ఉన్నందున లోక్‌సభ సెక్రటేరియట్‌ అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ రాహుల్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకుంటే.. శిక్ష తగ్గించే అవకాశం కూడా ఉందని, దీంతో పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రాహుల్‌ చట్టం ప్రకారం ఎంపి పదవికి అనర్హుడని, అయితే నిర్ణయాన్ని స్పీకర్‌కు సూచించాల్సి వుందని బిజెపి ఎంపి మహేష్‌ జెఠ్మలానీ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)