ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి !

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పూర్తికాక ముందే ఎండలు మండుతున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలోని కొంకణ్‌, గోవా, కర్ణాటక లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి.  మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణశాఖ (ఐఎండీ) నిపుణులు ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాతి రోజునే 4 నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టొచ్చని మరో ప్రకటన విడుదల చేశారు. దీనిని బట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఏటా ఈ సమయానికి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే ప్రస్తుత ఉష్ణోగ్రతలు అధికమనే చెప్పాలి. సాధారణంగా పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులను వాయవ్య ప్రాంతంలోని పర్వతాలు అడ్డుకుంటాయి. ఫలితంగా తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. పర్వత ప్రాంతంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతోపాటు, పొడి వాతావరణం నెలకొనడం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యధరా ప్రాంతంలో ఏర్పడిన తుపానులు భారత వాయవ్య ప్రాంతం మీదుగా ప్రయాణించి అక్కడ వర్షాలు కురిపిస్తాయి. కానీ, అలాంటి పరిస్థితులు లేకపోవడం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. మరోవైపు గుజరాత్‌లో ఏర్పడిన యాంటీ సైక్లోన్లు కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు.. భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు యాంటీ సైక్లోన్‌ పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)