కిరాణా దుకాణాలకు తప్పని జీఎస్టీ ?

Telugu Lo Computer
0


పన్ను ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. సందు గొందుల్లో ఉండే చిన్న, చిన్న కిరాణా దుకాణాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతోంది. పన్ను పరిభాషలో ఈ దుకాణాలను మామ్‌ అండ్‌ పాప్‌ స్టోర్స్‌ అంటారు. ఈ చిరువ్యాపారులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్ కస్టమ్స్‌ స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్న ఈ తరహా వ్యాపారాలను పన్ను పరిధిలోకి తీసుకువస్తామని తెలిపింది. ప్రస్తుతం రూ. 40 లక్షల వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపార సంస్థలన్నీ జీఎస్టీ కింద తమ వ్యాపారాలను నమోదు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని రూ. 20 లక్షల రూపాయలకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి తెచ్చినప్పుడు జీఎస్టీ కింద నమోదు చేసుకున్న వ్యాపారులు కేవలం 60 లక్షలు మాత్రమే. జనవరి 2023 నాటికి ఈ సంఖ్య కోటి 40 లక్షలకు చేరింది. ఈ సంఖ్యలో భారీ పెరుగుదలను చూస్తున్న ప్రభుత్వం మరికొందరిని ఇందులోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. B2C అంటే బిజినెస్‌ టూ కస్టమర్‌ సెగ్మెంట్‌లో చాలా భాగం పన్ను పరిధిలోకి లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సెగ్మెంట్‌లోనూ వ్యాపారం అధికంగానే ఉందని ప్రభుత్వం లెక్కలుగడుతోంది. వీళ్లను గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోబోతోంది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల దగ్గరున్న డేటా, ప్రైవేట్‌ డేటా బేస్‌లను దీని కోసం జల్లెడ పట్టనుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఆస్తి పన్ను చెల్లింపు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు, వాణిజ్య డైరెక్టరీల డేటాను వడకట్టి పన్ను చెల్లింపుదారులను ఒడిసిపట్టనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)