ఎంపీలు, నాయకులు మతపరమైన ప్రకటనలు చేయొద్దు !

Telugu Lo Computer
0


మతపరమైన అంశాలపై ప్రకటనలు చేయవద్దని బీజేపీ అధినేత జేపీ నడ్డా తాజాగా పార్టీ ఎంపీలు, నేతలకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. శనివారం బీజేపీ ఎంపీలతో వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల ముందు చర్చించాలని అన్నారు. అంతకు మించి ఎవరూ మతపరమైన ప్రకటనలు చేయొద్దని అన్నారు. అయితే పార్టీ అధికార ప్రతినిధికి దీన్నుంచి మినహాయింపునిచ్చారు. వారు మాత్రం మతపరమైన అంశాలపై వ్యాఖ్యానిస్తారని నడ్డా పేర్కొనడం గమనార్హం. మతపరమైన విషయాలు ఎవరికి సంబంధించినవో వారు మాత్రమే చూస్తారట. రాజకీయ నాయకులు వీటికి దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తమ ఉద్దేశాలు ''సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్'' అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అంశంపై మాత్రమే పని చేయాలని గట్టి వార్నింగే ఇచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలు క్రీడాపోటీలను మెరుగైన రీతిలో నిర్వహించాలన్నారు. సాధారణ బడ్జెట్‌తో అన్ని వర్గాలు లబ్ధి పొందాయని, ఈ విజయాలతో పాటు ప్రపంచంలో పెరుగుతున్న భారత్ బలాన్ని ప్రజలతో చర్చించమంటూ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మహిళా ఓట్లు కీలకమని చెప్పిన నడ్డా.. పార్టీలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి మహిళలను సత్కరించేందుకు సుష్మా స్వరాజ్ అవార్డును తొందరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ప్రకారం లబ్ది పొందిన మహిళలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు. సెల్ఫీ విత్ బెనిఫిషియరీ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే కోటి మంది లబ్ధిదారులతో తీసిన సెల్ఫీలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉజ్వల-ఆయుష్మాన్ కార్డుల వంటి పథకాల లబ్ధిదారులతో సమాచారం అందించడానికి , సెల్ఫీలు తీసుకోవడానికి పార్టీ ఈ నెలలో కొత్త యాప్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులతో సెల్ఫీ ఎలా తీసుకోవాలి, వారి వివరాలను ఎలా అప్‌లోడ్ చేయాలనే అంశాలపై బీజేపీ మహిళా విభాగం కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారట. సుష్మా స్వరాజ్ అవార్డు కింద, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి జిల్లాలో 10 మంది ప్రభావవంతమైన మహిళలను సత్కరించాలని మహిళా మోర్చా యోచిస్తున్నట్లు నడ్డా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)