నేతాజీ జయంతి నిర్వహించే అర్హత ఆరెస్సెస్ కు లేదు

Telugu Lo Computer
0


జనవరి 23న కలకత్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నిర్వహించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యోచిస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై బోస్ కుమార్తె అనితా బోస్ స్పందించారు. ''మానాన్న లెఫ్టిస్ట్, ఆయన లౌకికవాది, ఆరెస్సెస్ వి, మా నాన్నవి భిన్న ధృవాలు. వారు మానాన్న వారసత్వాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు'' అని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయాని కొస్తే, దేశంలోని ఇతర పార్టీలన్నిటికన్నా కాంగ్రెస్‌కు నేతాజీకి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయని అనితా బోస్ చెప్పారు. ఇదిలావుంటే రేపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కలకత్తా లోని షాహిద్ మినార్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. నేతాజీ బోధించినట్లుగా అన్ని మతాలను గౌరవించాలనే ఆలోచనకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు విరుద్దమని, ఆయన హిందువైనప్పటికీ ఇతర విశ్వాసాలను గౌరవించారని అనితా బోస్ అన్నారు. వివిధ మతాల మధ్య ఎప్పుడూ ఐక్యత, సహకారం ఉండాలని ఆయన కోరుకున్నారని ఆమె తెలిపారు. "సూటిగా చెప్పాలంటే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి లు రైటిస్టులు, నేతాజీ వామపక్షవాది" అని ఆమె జర్మనీ నుండి ఫోన్‌లో ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ చెప్పారు. "ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, నేతాజీ భావజాలం వేరు వేరు. రెండు విరుద్దమైన విలువలను ప్రతిపాదిస్తాయి. నేతాజీ ఆదర్శాలను, ఆలోచనలను స్వీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తే అది మంచిదే. చాలా మంది నేతాజీ పుట్టినరోజును జరుకుంటారు. వారిలో చాలా మంది తప్పనిసరిగా అతని ఆలోచనలతో ఏకీభవిస్తారు" అని ఆమె చెప్పారు. నేతాజీ ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించేవారా అని అడిగిన ప్రశ్నకు, "అతను ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై విమర్శనాత్మక ప్రకటనలు చేశారో లేదో నాకు తెలియదు. కానీ నేతాజీ అభిప్రాయాలు ఏమిటో నాకు తెలుసు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి కూడా నాకు తెలుసు.రెండు విలువలు పూర్తిగా విరుద్దమైనవి. " అని ఆమె అన్నారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఆయనను గౌరవించటానికి చాలా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆమె ప్రశంసిస్తూనే ''నేతాజీ ఈ రోజు జీవించి ఉంటే, ఆయన అవే అభిప్రాయాలతో ఉంటే, అప్పుడు బిజెపి అతనిని గౌరవించేదా ? ఎన్నటికీ గౌరవించదు. నేతాజీ లేరు కాబట్టి వారు ఆయన వారసత్వాన్ని వాడుకోవాలనుకుంటున్నారు. వారికి వారి స్వంత ప్రయోజనాలే ముఖ్యం" అని ఆమె చెప్పింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)