ఈ మొక్క నుంచి స్ఫూర్తిని పొందాలి !

Telugu Lo Computer
0


సంవత్సరాల తరబడి కరువు వేధించినా, పూర్తిగా ఎండిపోయినా, తడి తగిలేసరికి మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకునే ఓ మొక్క గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపారులు ఏ విధంగా మనసు దిటవు చేసుకుని, నిలదొక్కుకోవాలో ఈ మొక్క నుంచి స్ఫూర్తిని పొందాలని సలహా ఇచ్చారు. వ్యాపార వ్యూహాల్లో సంయమనం పాటించాలని తెలిపారు. ఈ మొక్క గురించి వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వీడియోను రీషేర్ చేశారు. 15 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో సెలగినెల్లా లెపిడోఫైల్లా అనే మొక్కను చూపించారు. ఇది పిండి ముద్దలా ఉంది. పూర్తిగా ఎండిపోయి ఉంది. దీనిపై కొద్దిగా నీరు వేసేసరికి క్షణాల్లోనే విచ్చుకుంది. దీని ఆకులు వెనువెంటనే తెరుచుకున్నాయి. అంతకుముందు పైకి కనిపించని పచ్చదనం నీరు పోసిన తర్వాత కనిపించింది. ఈ పునర్జీవించే మొక్క పేరు సెలగినెల్లా లెపిడోఫైల్లా అని తెలిపారు. ఇది సంవత్సరాల తరబడి కరువు కాటకాలను తట్టుకుని నిలవగలదని చెప్పారు. దాదాపు పూర్తిగా ఎండిపోయినప్పటికీ, కొద్దిగా తడి తగిలేసరికి తిరిగి జీవిస్తుందని తెలిపారు. దీనిని రీషేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇది చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. వ్యాపార రంగానికి ఇది చెప్పే పాఠం గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఎటువంటి ఆర్థిక కరువు కాటకాలనైనా తట్టుకుని నిలిచేందుకు ఈ మొక్క మాదిరిగా కోలుకునే శక్తి, సామర్థ్యాలను మీ వ్యూహంలో, మీ సంస్థలో నిర్మించుకోండని సలహా ఇచ్చారు. తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్న వ్యాపార సంస్థల యజమానులను ఉత్తేజపరచడం కోసం ఆనంద్ మహీంద్రా ఈ మొక్క గురించి వివరించారు. సాధారణంగా తీవ్ర నష్టాల్లో చిక్కుకున్న వ్యాపారులు తమ వ్యాపారాలను మూసేస్తూ ఉంటారు. తమ సంస్థలను పునరుద్ధరించుకోవడం గురించి ఆలోచించరు. అందుకే ఆనంద్ ఈ మొక్కను చూపిస్తూ, వ్యాపార సంస్థలకు ఈ మొక్క చెప్పే పాఠం గురించి ఆలోచించకుండా ఉండలేనని తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని వ్యూహ రచన చేసుకోవాలని సూచించారు. ఈ మొక్క గురించి చెప్పి, అందరినీ ఉత్తేజపరచినందుకు ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు అభినందిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)