భారీగా పెరిగిన బిఆర్‌ఎస్ ఆస్తులు !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఇటీవల భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)గా మారింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాని ఆస్తులు 66 శాతం పెరిగాయి. వార్షిక ఆడిట్ రిపోర్టును భారత ఎన్నికల సంఘానికి సమర్పించడం జరిగింది. బిఆర్‌ఎస్ ఆస్తులు 2020-21లో రూ. 288 కోట్లు ఉండగా ఇప్పుడది రూ. 480 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో పార్టీ ఆదాయం రూ. 37.65 కోట్ల నుంచి రూ. 218.11 కోట్లకు పెరిగింది. చందాల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు ఆదాయం వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఇబ్బడి ముబ్బడిగా చందాలు రావడం మామూలే. పలు రూపాల్లో వచ్చే ఆదాయాల లెక్కలను పార్టీలు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేస్తుంటాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం బిఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ ఆదాయం ఒక్క ఏడాదిలోనే ఐదు రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ 2021-22 సంవత్సరంలో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 153 కోట్లు గడించింది, మరో రూ. 40 కోట్లు ఎలెక్టోరల్ ట్రస్ట్ ద్వారా పొందింది. గత ఏడాది వీటి కింద ఎలాంటి ఆదాయం లేదు. సభ్యుల నుంచి వార్షిక ఫీజులు/చందాల రూపంలో వచ్చిన సొమ్ము రూ. 16.70 కోట్ల నుంచి రూ. 7.54 కోట్లకు పడిపోయింది. విరాళాలు, చందాలు వంటివి ఈ ఏడాది ఏమి రాలేదు. కాగా 2020-21లో కంపెనీల నుంచి రూ 3.15 కోట్లు పార్టీకి అందాయి. పార్టీకి 2021-22లో ఖర్చు రూ. 7.68 కోట్లు, ఇది 202021లో రూ. 4.79 కోట్లు. 2022 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ. 307 కోట్లు. ఇది గత సంవత్సరం రూ. 292గా ఉంది. స్టేట్‌మెంట్ ప్రకారం 12 నెలలకు మించి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న పార్టీ బ్యాలెన్స్ 2021-22లో రూ. 451 కోట్లు. ఇది 2020-21లో రూ. 256 కోట్లు. ఏప్రిల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీకి రూ. 1000 కోట్లు ఉన్నాయని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ఇది సరిపోతుందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)